ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలతో కలిసి అర్ధనగ్నంగా పెయింటింగ్,,,ఈ కేసులోఉపశమనం కల్పించిన కేరళ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 09:30 PM

మహిళలకు తమ శరీరాలపై స్వయం నిర్ణాయక హక్కు తరచూ నిరాకరణకు గురవుతోందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ జీవితాలు, శరీరాలపై వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే లైంగిక వేధింపులు, వివక్షతో పాటు ఒంటరితనానికి గురికావాల్సి వస్తోందని అభిప్రాయపడింది. జువెనైల్‌ జస్టిస్‌, పోక్సో, ఐటీ చట్టాల కింద మహిళా హక్కుల కార్యకర్తపై నమోదైన కేసును సోమవారం కొట్టివేస్తూ పైవిధంగా స్పందించింది. తన మైనర్ పిల్లలతో కలిసి అర్ధనగ్న భంగిమలో రెహనా ఫాతిమా అనే హక్కుల కార్యకర్త తన శరీరంపై పెయింట్‌ వేయించుకున్నారు.


‘శరీరం-రాజకీయాలు’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆమైపై పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌, ఐటీ చట్టంలోని నిబంధనల కింద కేరళలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో ఫాతిమా హైకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ ఊరట లభించింది. దీనిపై జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. శరీరం ఎగువ భాగాల అర్ధనగ్నత్వం విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూ సందేశమిచ్చేందుకు బాడీ పెయింట్‌ కళను వినియోగించినట్లు తెలిపారు.


‘నగ్నత్వాన్ని కామోద్రేక దృష్టితో ముడిపెట్టడం తగదు. అశ్లీలత, అసభ్యత, కామోద్దీపనలతో నగ్నత్వాన్ని అన్నివేళలా సమానంగా భావించడం తప్పు.. కామోద్దీపన అనే భావన చూసే వారి దృష్టిని బట్టే ఉంటుంద’ని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దేవాలయాలపై వివిధ భంగిమల్లోని శిల్పాలు ప్రాచీన కాలం నుంచీ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లీ,బిడ్డల అనుబంధంలోని గాఢత, పవిత్రతను ఎవరూ ప్రశ్నించలేరని తేల్చిచెప్పారు.


ఒక సామాజిక లక్ష్యం కోసం ఫాతిమా రూపొందించిన వీడియోను అవగాహన చేసుకోవడంలో దిగువ కోర్టు విఫలమైదని పేర్కొన్నారు. ఆమెపై నమోదైన కేసులన్నింటినీ రద్దుచేయాలని పోలీసులను ఆదేశించారు. ‘సమానత్వం, గోప్యత కోసం ప్రాథమిక హక్కులో తన శరీరం గురించి స్వయంప్రతిపత్తి నిర్ణయాలు తీసుకునే హక్కు స్త్రీకి ఉంది.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి కూడా వస్తుంది’ అని అన్నారు.


‘పిల్లలను అశ్లీల చిత్రాలకు ఉపయోగించినట్లు చూపించడానికి ఏమీ లేదు.. వీడియోలో లైంగికత గురించి ఎలాంటి సూచన లేదు.. పురుషుడు లేదా స్త్రీ అయినా, ఒక వ్యక్తి పైభాగంలో పెయింటింగ్ చేయడం లైంగిక అసభ్యకరమైన చర్యగా చెప్పలేం’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఫాతిమా అప్పట్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com