స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను భారత నౌకాదళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. నీటిలోపల లక్ష్యాన్ని ఈ టార్బిడో సునాయాశంగా ఛేదించింది. దీంతో భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో, నేవీ సంయుక్తంగా స్వదేశీ సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేశాయి. టార్పిడో పరీక్షకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
‘‘నీటి అడుగున లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డీఆర్‌డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి.. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన హెవీ వెయిట్ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ఛేదించింది.. ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనం’’ అని నేవీ ట్వీట్ చేసింది. అయితే ఈ టార్పిడో పేరును గానీ.. ఇతర ఫీచర్లను గానీ నౌకాదళం వెల్లడించలేదు. హిందూ మహా సముద్రంలో చైనాతో ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, ఇప్పటికే భారత నౌకాదళం వద్ద వరుణాస్త్ర అనే అధిక బరువు గల టార్పిడో ఉంది. ఇది స్వయం చోదిత, నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి. 30 కిలోమీటర్ల దూరంలోని శత్రు నౌకల లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది.