ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాయి. లోకేష్ పాదయాత్ర, మహానాడు నిర్వహణతో టీడీపీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. మహానాడు, టీడీపీ మినీ మేనిఫెస్టో పై దాదాపు వారం రోజులు ఏపీలో జోరుగా చర్చ జరిగింది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్.. వారాహితో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. పవన్ వారాహి టూర్‌పైనా చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో.. అధికార వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. దిగడం దిగడమే.. టాప్ గేర్ వేశారు. ప్రజల్లో తన గురించి చర్చ జరిగేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రెండు మూడు రోజులకో కార్యక్రమం నిర్వహించి.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో జగన్ ఏకంగా 7 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రెండు వారాల్లో భారీఎత్తున కార్యక్రమాలు నిర్వహించి.. చంద్రబాబు, పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మే 22న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన జగన్.. అప్పటినుంచి వరుస కార్యక్రమాలు నిర్వహించారు. మే 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 26న సీఆర్డీయే పరిధిలో 50 వేల 793 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్‌పై పెద్దఎత్తున చర్చ జరిగింది. అదే రోజు ఢిల్లీకి వెళ్లారు. 27న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. 28 వరకూ ఢిల్లీలోనే ఉన్నారు.
ఇక మే 30న తన నాలుగేళ్ల పాలన పూర్తైన సందర్భంగా.. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు. అక్కడ పిల్లలతో చాలాసేపు గడిపారు. జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమం నిర్వహించారు. వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా.. ఒక్కో రైతుకు రూ.7,500చొప్పున.. 52,30,939 మంది రైతన్నలకు రూ.3,923.21 కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు.
జూన్ 2న వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. చుట్టుగుంట సర్కిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 6న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసిత కుటుంబాల తరలింపుపై అధికారులతో సమీక్షించారు. అధికారులతో సమీక్ష సందర్భంగా కూడా జగన్ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు.
గత రెండు వారాల్లో జరిగిన కార్యక్రమాలు అలా ఉంటే.. అతి త్వరలో గుడివాడలో జగన్ పర్యటించనున్నారు. టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో జగన్ మాట్లాడబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలా వరుస కార్యక్రమాలతో జగన్ స్పీడ్ పెంచడంతో.. ప్రజల దృష్టి ఎక్కువగా జగన్‌పై ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ వరుస కార్యక్రమాలతో రంగంలోకి దిగినప్పుటి నుంచి లోకేష్ పాదయాత్ర, టీడీపీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గురించి ప్రజల్లో చర్చ తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.