అన్నదాతలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పెసర, వరి సహా వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పెంచడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. 2023 - 2024 ఖరీఫ్ సీజన్ నుంచి ఈ మద్దతు ధర పెంపు ఉంటుందని వెల్లడించారు.
మంచి నాణ్యమైన రకం గ్రేడ్ -ఎ వరికి రూ.163లు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు క్వింటాల్ గ్రేడ్ - ఎ వరి ధర రూ.2203 కి పెరిగినట్లు పేర్కొంది. సాధారణ వరి రకాలకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.143 చొప్పున కేంద్రం పెంచింది. ఈ పెంపుతో సాధారణ వరి రకం క్వింటాల్ ధర రూ.2,183కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్ గోయల్ చెప్పారు.
ఈ పెంపులో అత్యధికంగా పెసర పంటకు కనీస మద్దతు ధరను భారీగా పెంచారు. క్వింటాల్‌కు రూ. 803 అదనంగా చెల్లించనున్నారు. గతేడాది క్వింటాల్ పెసర ధర రూ.7,755 లు ఉండేది. దాన్ని ఈసారి 10.4 శాతం పెంచారు. దీంతో క్వింటాల్ పెసరకు మద్దతు ధర రూ.8,558కి చేరింది. వీటితోపాటు హైబ్రిడ్ జొన్న క్వింటాల్‌కు రూ.3180 చెల్లించనున్నారు. జొన్న(మాల్దండి)కి రూ.3225.. రాగులు రూ.3846.. సజ్జలు రూ.2500కు పెరిగాయి. పొద్దుతిరుగుడు(గింజలు) రూ.6760, మొక్కజొన్న రూ.2090, సోయాబీన్ రూ.4600, వేరుశెనగ రూ.6377, పత్తి (మీడియం పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020 చొప్పున ఈ 2023 -2024 సీజన్‌లో రైతులకు మద్దతు ధరగా చెల్లించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
పంటలకు కనీస మద్దతు ధరతోపాటు వివిధ నిర్ణయాలకు కూడా కేంద్ర కేబినేట్ సమావేశాల్లో పచ్చజెండా ఊపారు. ఢిల్లీలోని హుడా సిటీ సెంటర్ నుంచి గురుగ్రామ్‌లోని సైబర్ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 27 స్టేషన్ల నుంచి 28.50 కిలోమీటర్ల పొడవు ఈ మెట్రో నిర్మాణం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5452 కోట్లుగా అంచనా వేశారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ మంజూరు అయినప్పటి నుంచి నాలుగేళ్లలో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నారు.