రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, ఎల్లో మీడియా కలసికట్టుగా చేస్తున్న ప్రచారాన్ని సీఎం వైయస్ జగన్ మరోసారి కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2019 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ కూడా మార్చిలోనే వస్తుంది. అంటే ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది’ అని మంత్రులతో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి మండలి సమావేశం అనంతరం అజెండా ముగిశాక అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సమకాలీన రాజకీయ పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పించేలా జీపీఎస్ విధానాన్ని తేవడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకుంటూ సుమారు పది వేల మంది రెగ్యులరైజేషన్ను తాజాగా ఆమోదించామన్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల హామీల్లో 99.5 % అమలు చేశామని చెప్పారు.