న్యాయవాదులు హెల్త్ కార్డులు పొందేందుకు జూన్ 10 వరకు గడువు ఉందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు, ప్రధాన కార్యదర్శి పొన్నాడ రాము తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ మెడీక్లైమ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు 2023-24 సంవత్సరానికి న్యాయవాదులకు ఖరారు చేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్, ప్రభుత్వ గ్రాంటు కింద ప్రత్యేక కమిటీ 2023-24 సంవత్సరానికి న్యాయవాదులకు గ్రూపు మెడీక్లైమ్, వ్యక్తిగత ప్రమాద విధానాలు ఖరారు చేసిందని పేర్కొన్నారు. కుటుంబంలో న్యాయవాదితో పాటు మరో ముగ్గురు (భార్య, పిల్లలు, ఆధారపడి ఉన్నవారు) మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ప్రీమియంలో దాదాపు 1/3 వంతు సంబంధిత భీమా చేసిన న్యాయవాది చెల్లించాలని, మిగతా మొత్తాన్ని ఎపీ ప్రభుత్వం గ్రాంటు, బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారని తెలిపారు. ప్రమాదవశాత్తు న్యాయవాది చనిపోతే (కుటుంబ సభ్యులకు వర్తించదు) రూ. 10 లక్షలు పరిహారం అందుతుందని చెప్పారు.
70 ఏళ్ల లోపు న్యాయవాదులు మాత్రమే పాలసీకి అర్హులని స్పష్టం చేశారు. ముందుగా మీకు సంబంధించిన వివరాలు బార్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో https: //barcouncilap. org/health-insurance-scheme/ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలన్నారు. మీ వివరాలు అన్ని సరిగ్గా ఉన్నట్టయితే, తర్వాత ఈ కింద ఉన్న లింకుని క్లిక్ చేసి, మీ ఎన్‌రోల్‌మెంట్ టైపు చేసి, మీరు పేమెంట్ చేసుకోవచ్చన్నారు. ఈ కింద ఉన్న పేమెంట్ లింక్ 2023 జూన్ 10 వరకు మాత్రమే పని చేస్తుందని గమనించాలని కోరారు. ఈ పాలసీ 2023 జూన్ 15 నుంచి 2024 జూన్ 14 వరకు అమలులో ఉంటుందని చెప్పారు.