జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ లేఖ రాశారు. జూన్ రెండవ వారం ముగుస్తున్నా ఇప్పటికీ అధిక ఉష్టోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు విద్యార్థులు హాజరైతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఎండ వేడికి తట్టుకోలేక మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూముల్లో నుంచి భయటకు రావడం లేదని.. అలాంటిది చిన్న పిల్లలు పాఠశాలలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ నాడు - నేడు పనులు పూర్తి చేయడంలో ఎందుకు లేదని నిలదీశారు. మరోవైపు టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రకరకాల యాప్‌లు తెచ్చి వారిపై పని భారం మోపారన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లపై వేధింపులు సరికాదని అన్నారు. అధిక ఉష్టోగ్రతల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పునఃప్రారంభం పది రోజులు వాయిదా వేయాలని అనగాని సత్యప్రసాద్ లేఖలో డిమాండ్ చేశారు.