జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరాతో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకుంది. నెడ్‌క్యాప్ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్‌పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఈ వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి ఈఎంఐ అవకాశం ఇస్తోంది. నెలకు కనీసం రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని గతంలోనే ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ సూచించింది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ నిర్ణయంతో ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో హైవేలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రైవేట్ స్థలాలు వంటి చోట్ల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే స్టేషన్లని తీసుకురావాలనుకుంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రోత్సాహించడం ద్వారా వాతావరణంలో కాలుష్యం తగ్గించొచ్చు అనేది ఆలోచన.