ఏపీలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నైరుతి రుతపవనాల రాక ఆలస్యం కారణంగా జూన్ రెండో వారంలోనూ ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపటి నుంచి (జూన్ 12) నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులు పొడగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరో పది రోజులు సెలవులు పొడగించాలని వారు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పాఠశాలలు యథావిథిగా రీఓపెన్ అవుతాయని స్పష్టం చేసింది. అయితే ఎండ గాలుల తీవ్రత దృష్ట్యా ఈనెల 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి జూన్ 17 వరకు ఉదయం 07.30 - 11.30 వరకు పాఠశాలల తెరిచి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలలు ఈ షెడ్యూల్ పాటించాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాల్లలోనే విద్యార్థులకు ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ అందించాలని ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారిని ఇంటకి పంపించాలని సూచించింది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా విధానాల కోసం వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. నిపుణులు, నిష్ణాతులు, ఉన్నతాధికారులతో ఈ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌ల అమలుకు ఈ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్‌గా ప్రిన్సిపల్ సెక్రెటరీ, కన్వీనర్‌గా కమిషనర్ వ్యవహరిస్తారు. గ్రూప్ సభ్యులుగా అశుతోష్ చద (మైక్రో సాఫ్ట్ ఇండియా) శాలిని కపూర్( అమెజాన్ వెబ్ సిరీస్) శ్వేతా కరుణ( ఇంటెల్ ఆసియా), గూగుల్, నాస్కామ్ జైజిత్ భట్టాచార్య, అర్చన జి.గులాటి తదితరులు వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.