ఇటీవల 280 మందిని బలితీసుకున్న ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేయడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిగ్నలింగ్ లాకింగ్ వ్యవస్థపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాకింగ్ వేసి భద్రంగా చూసుకోవాలని ఆదేశించింది. నియంత్రణ వ్యవస్థలు ఉండే రిలేరూంలు, లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద సిగ్నలింగ్-టెలికమ్యూనికేషన్ పరికరాలను ఉంచే ‘రిలే హట్’లు, పాయింట్/ ట్రాక్ సర్క్యూట్ సిగ్నళ్ల వద్ద అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని శనివారం ఈ మేరకు ప్రకటన చేసింది.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేబోర్డు వరసగా పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. ఎవరైనా రిలేరూంలోకి ప్రవేశించి సిగ్నలింగ్‌లో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని, కోరమండల్ రైలు ఇలాంటి పరిస్థితుల్లోనే లూప్‌లైన్లోకి వెళ్లిందని తాజా ఉత్తర్వు పరోక్షంగా ప్రస్తావించింది. ఇంటర్‌లాకింగ్‌లో ఎవరో జోక్యం చేసుకున్నట్టు ఆధారాలు చూపుతున్నందు వల్ల దానిని లోపరహితంగా ఉంచడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. డబుల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసేవరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ లాక్‌ను స్టేషన్ మాస్టర్ వద్ద భద్రపరచాలని బోర్డు ఉత్తర్వులు ఆదేశిస్తున్నాయి.
ఏ విభాగం లాక్‌లు ఎవరు తీశారు, ఎవరు వేశారు అనేవి పట్టికలో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒడిశాలోని బహానగాబజార్ స్టేషన్ వద్ద ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను వేరే పనుల కోసం తాత్కాలికంగా నిలిపివేసి, పునరుద్ధరించినప్పుడు స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చినట్లు నివేదించారు. అయితే, ఆ పని పూర్తికాకుండానే టెక్నీషియన్ ఒకరు లొకేషన్ బాక్సును గ్రీన్‌సిగ్నల్ చూపేలా మార్చారని అధికారులు తెలిపారు. ఇలాంటివి జరగకుండా సాంకేతికంగా ఏమేం చేయాలో సవివరంగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.