నెల్లూరులోని రవీంద్రనాథ్‌ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు కీ.శే మోపూరు వేణుగోపాలయ్య స్మృత్యంకంగా జరిగిన ‘గురువుకు వందనం’ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మాతృభాషను మరిచామంటే శ్వాసను కోల్పోయినట్లేనన్నారు. మాతృభాషలో పరిపాలన, ఉత్తర్వులు, చట్టాలు, న్యాయస్థానాలలో తీర్పులతోపాటు అసెంబ్లీ, పార్లమెంటులో కూడా మాతృభాషలోనే మాట్లాడాలని కోరారు. తాను ఉపరాష్ట్రపతిగా సభ్యులకు రాజ్యసభలో మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పించినట్లు గుర్తుచేశారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ ప్రేమించి, ఇతర భాషలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతా బయెటిక్ అధినేత కేఐ.వరప్రసాద్‌రెడ్డి, మనసు ఫౌండేషన్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.