కొన్ని తుఫాన్లు మనదేశంతోపాటు మన దాయాదీ దేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అతి తీవ్రంగా మారిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్-పాకిస్థాన్ మధ్య తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. సింధు ప్రావిన్సులోని తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. అరేబియా సముద్ర తీరంలోని అన్ని ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సింధు ముఖ్యమంత్రి మురాద్ అలీ షా తీర ప్రాంతంలో ఏరియల్ పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. 15న సింధు తీరాన్ని తాకనున్న తుపాను తీవ్రత 17, 18 నాటికి తగ్గుముఖం పట్టనుంది. ఈ ఏడాది పాకిస్థాన్‌ను తాకనున్న తొలి తుపాను ఇదే. ప్రజలు సముద్ర తీరాలవైపు వెళ్లకుండా కరాచీ సీ వ్యూ రోడ్డును నిన్న మూసివేశారు. రేవు పట్టణమైన కరాచీలోకి ఎవరూ రాకుండా అడ్డుకట్ట వేసిన అధికారులు నగరంలో 144 సెక్షన్ విధించారు.
తుపాను కారణంగా గంటకు 160-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచ్చే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, సముద్రంలో అలలు 35 నుంచి 40 అడుగుల మేర ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. గతేడాది సంభవించిన తుపాన్ల కారణంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. 3.30 కోట్ల మంది వాటి ప్రభావానికి గురయ్యారు.