ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
2021లో మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పట్లో వైట్‌హౌస్‌ను సందర్శించారాయన. అది- క్వాడ్ సమ్మిట్‌లో భాగం. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. అమెరికా వేదికగా జరిగిన క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడానికి అప్పట్లో మోదీ ఆ దేశ పర్యటన చేపట్టారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా ఈ పర్యటన ఉండబోతోంది.
తమ దేశ పర్యటనకు వచ్చే మోదీకి జో బైడెన్ నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. జూన్ 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య.. భారత ప్రధానికి వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి.
అదే సమయంలో అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ కెవిన్ మెక్‌క్యార్థీ పంపించిన ఆహ్వానాన్ని అంగీకరించారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో న్యూజెర్సీలోని ఓ భారతీయ రెస్టారెంట్ వినూత్నంగా స్వాగతం పలకనుంది. మోదీజీ థాలి.. పేరుతో ప్రత్యేకంగా వంటకాన్ని తయారు చేసింది. ఈ రెస్టారెంట్ భారత సంతతికి చెందిన వ్యక్తి నడుపుతున్నారు. ఆయన పేరు శ్రీపాద కులకర్ణి. నోరూరించే వంటకాలతో కూడిన థాలి ఇది. దీనికి మోదీజీ థాలి అని పేరు పెట్టారు.