పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సీపీఐ పోరుబాట ఆగదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతా మంగళవారం రెండో రోజు మండలంలోని వేలేరు నుంచి ఉప్పేరు, కుక్కు నూరు, దాచారం, ఆరవపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. పునరావాస ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు. గత ఏడాది వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ము ఖ్యమంత్రి జగన్ చేసిన వాగ్దానాన్ని తక్షణం అమలుచేసి పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.10 వేలు చెల్లించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి మున్నీరు, సన్నేపల్లి సాయిబాబా, సీపీఐ కుక్కునూరు, వేలేరుపాడు మండల కార్యదర్శులు మైసాక్షి వెంకటాచారి, బాడిస రాము, ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం దారయ్య, జిల్లా సమితి సభ్యులు అయితా సురేష్, కొన్నే లక్ష్మయ్య, కరటం వెంకటేశ్వర్లు, సోడే ప్రసాద్, సోడే సత్తిబాబు, మడిపల్లి రమణయ్య, ఎర్రా మధు, ఎ.సోమరాజు తదితరులు పాల్గొన్నారు.