పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై 1072లో రాజేంద్రచోళ బ్రహ్మాధిరాజు ఆదేశాలతో వేసిన పురాతన శిలాశాసనం వెలుగు చూసింది. పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హిస్టరీ లెక్చరర్ ఎం.ఆంజనేయరెడ్డి ఇటీవల మాణిక్యవరదరాజుస్వామి ఆలయం వెనుక పుంగమ్మ చెరువుకట్టపై గతం అమర్చిన విరిగిన శిలాశాసనాన్ని గుర్తించారు. ఆ తమిళశాసనాన్ని ఫొటోతీసి తన స్నేహితుడు, కేంద్ర పురావస్తుశాఖ మైసూరు డైరెక్టర్ కె.మునిరత్నంరెడ్డికి పంపారు. తమిళభాషలోని శాసనాన్ని తెలుగులోకి తర్జమా చేసి అందులోని వివరాలను మంగళవారం తెలిపారు. రాజేంద్రచోళ బ్రహ్మాధిరాజు పాలనలోని మూడో సంవత్సరంలో (1072వ సంవత్సరం) రాజు ఆజ్ఞ ప్రకారం.. పులినాడు డివిజన్‌లోని కుంగనూరు అలియాస్ వలవనారాయణ చతుర్వేది మంగళం సభ ద్వారా రత్తపాదికొండల చెరువు నిర్మాణానికి భూమి అసైన్‌మెంట్‌ను నమోదు చేసినట్లు శాసనంలో ఉంది. పుంగనూరు ప్రాంతంలో పురాతనమైన విలువైన సమాచారం రాతి శిలాశాసనాల్లో ఉందని ఆంజనేయరెడ్డి చెప్పారు. ఇవి శిథిలావస్థకు చేరి భావితరాలకు సమాచారం లేకుండా పోతుందన్నారు. తాను అనేక శాసనాలను మైసూరు డైరెక్టర్‌కు పంపి ప్రజలకు సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. పురాతన శిలాశాసనాలను గుర్తించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.