రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. ప్రైమరీ స్కూల్‌లో టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఏపీలో ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బటన్ నొక్కి లక్షల కోట్లు ఇచ్చామంటున్న జగన్.. పన్నుల రూపంలో ప్రజలపై భారం వేసి ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి కనీసం 20-30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. బీజేపీ సహకారం లేకపోతే ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబడదన్నారు. బీజేపీ పెద్దలు జగన్‌కు ప్రాణవాయువు అందిస్తున్నారన్నారు.
ఏపీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇటు జగన్‌కు అటు చంద్రబాబుకు ఓటేసే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వారంతా కొత్త ముఖం కోసం ఎదురుచూస్తున్నారన్నారు మోహన్. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వారి దృష్టి కాంగ్రెస్ మీద పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపడుతుందని.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. జగన్ సర్కార్ నాలుగేళ్లలో ఏం సాధించిందని.. హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు కాపులకు.. మరో రెండున్నర ఏళ్ళు ఓబీసీలకు అధికారం ఇస్తామన్నారు చింతా మోహన్. కాంగ్రెస్ పార్టీతో తాను మాట్లాడి ఒప్పిస్తాను అన్నారు. ఇన్నేళ్లలో కేవలం రెండు వర్గాలకు మాత్రమే అధికారం లభించిందని.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిపోయాయన్నారు. చంద్రబాబు తొందరబాబు... అనవసరంగా వెళ్లి బీజేపీని కలిశారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి తాను మాట్లాడనన్నారు. బీజేపీకి కేంద్రంలో 100-125 స్థానాలు మాత్రమే వస్తాయని.. ఏపీలో పేదల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. ఇందిరాగాంధీ చనిపోయినా ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో కర్ణాటక ఎన్నికల్లో తెలిసిందన్నారు.