నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో తొలిరోజే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో లోకేష్ వెంట జనమే లేరన్నారు. ఎండకు తాళలేక మధ్యాహ్నం వరకు టెంట్‌లో పడుకుంటారట అని ఎద్దేవా చేశారు. సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చి సెల్ఫీలు దిగుతారట అని సెటైర్లు వేశారు. అసలు లోకేష్ వాకింగ్‌కు వచ్చినట్టా.. సమస్యల పరిష్కారానికి వచ్చినట్టా..? అని ప్రశ్నించారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
'నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. లోకేష్‌కు అంత క్రేజ్, ప్రజాదరణ ఉంటే ఒక్క శాతం ఓటర్లు అయినా పాదయాత్రలో పాల్గొని ఉండాలి కదా. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కనీసం 2 వేల మంది జనాన్ని కూడా సమీకరించలేకపోయారు. లోకేష్‌కు వీడ్కోలు పలకడానికి వచ్చిన జనం.. నెల్లూరు జిల్లాకు స్వాగతం పలకడానికి వచ్చిన జనాన్ని మొత్తం కలిపినా కూడా 3 వేల మందికి మించి ఉండరు' అని కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చే సరికి మూగబోయింది. లోకేష్ నుంచి పెద్దగా ఆశించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడలేడు. మాట్లాడితే అర్థం కాని పరిస్థితి. లోకేష్‌కు అసలు సబ్జెక్టే లేదని క్యాడర్‌కు అర్థమైంది. విషయం లేని వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడటం కూడా మంచిది కాదు' అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.