బీజేపీపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదిలావుంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పే వరకూ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. విశాఖపట్నంలో భూదందా జరిగితే ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో అమిత్ షా, జీవీఎల్ నరసింహారావు మాట్లాడారని అర్థమవుతోందన్నారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీతో తమ బంధం ఎలా ఉందో.. అమిత్ షాతోనూ అలానే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకరితో ఎక్కువ.. మరొకరితో తక్కువ లేవన్నారు. ఇక, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా 2 వందే భారత్ రైళ్లు వచ్చాయి తప్ప బీజేపీ ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. 9 సంవత్సరాల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలాగన్నారు. తమకు రావాల్సిన నిధులను వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాల్సి ఉందన్నారు. బీజేపీ నుంచి తమకు ఎలాంటి వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ చెప్తున్న మాటల్నే ఇప్పుడు బీజేపీ చెబుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే కడుపు మంటతోనే వ్యాఖ్యలు చేశారన్నారు. రాష్ట్రానికి ముష్టి వేసినట్లు నిధులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన వారు ఒక విజన్‌తో మాట్లాడాలని హితవుపలికారు.
ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. కాశీ యాత్ర.. ఛార్ ధమ్ యాత్ర మాదిరిగా.. వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు యాత్రలు చేస్తే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవటం సాధారణమని.. వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడూ తాము అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.
ఇక, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారని.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తానని చెప్పాలన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్ట్‌నర్ చంద్రబాబునాయుడే ఇటీవల తాము అమలు చేస్తున్న పథకాలను పెంచి ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు తాను తీసుకొచ్చిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.