జనంలోకి వెళ్లేందుకు జనసేనాని సిద్దమవుతున్నారు. అన్నవరం సత్యదేవుడి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం కత్తిపూడిలో తొలి బహిరంగ సభకు బయల్దేరారు. కత్తిపూడి బహిరంగ సభ ప్రాంగణానికి జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడి పవన్ కల్యాణ్ రానున్నారు. వారాహి మీద నుంచి తొలి సారి ప్రసంగించనున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ప్రాంగణం వద్దకు వారాహి వాహనం చేరుకుంది.
ఈ నేపథ్యంలో.. పవన్ వారాహి యాత్రపై వైసీపీ కీలక నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. 'చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న.. టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?' అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఇటు సజ్జల కూడా పవన్ యాత్రపై ఘాటుగా స్పందించారు. 'కేంద్రమంత్రులే జగన్ పాలనను పొగుడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చి మాట్లాడుతున్న వాళ్లు విదేశాల నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీన మేషాలు లెక్కపెట్టుకుని వ్యాన్ తీసుకుని పవన్ బయలుదేరడం కాదు.. చంద్రబాబు డైరెక్షన్‌లో యాంటీ వైసీపీ ఓటు చీలకూడదంటున్నాడు. ఇన్నాళ్లు పవన్‌ను ఎవరైనా తిరగద్దన్నారా. మాకు అభ్యంతరమే లేదు తిరగండి' అని సజ్జల వ్యాఖ్యానించారు.