జనంతో మమేకమవుతూ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పడమటినాయుడుపల్లిలో రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశిల హైలెవల్ కాలువ పనులపై చర్చించారు. వరదల సమయంలో డ్యామ్, గోడలు దెబ్బతిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల జలాశయం సమస్యలు పరిష్కరించి, వలసలు లేకుండా చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ సాధించింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో చోరీ కేసు, సీబీఐ విచారణలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో కూడా వీరు ప్రత్యక్షంగా పాల్గొనలేదని.. ఒక్క సమస్య కూడా పరిష్కారించ లేదని మండిపడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఫైల్స్ దొంగతనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని లోకేష్ ఆరోపించారు.
టీడీపీ హయాంలోనే ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందని లోకేష్ అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ప్రస్తుత ప్రభుత్వం కరెంటు బిల్లులు కట్టలేక మూతపడ్డాయన్నారు. హార్టికల్చర్‌ను నెంబర్ వన్‌గా చేస్తామని లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో రాయలసీమలో ఒక రైతు ఎకరా భూమిలో కోటి రూపాయిలు సంపాదించారని తెలిపారు.
ఇక, రాష్ట్రంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఎంపీ నకిలీ విత్తనాలు సరఫరా చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలను అరికడతామన్నారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలో వచ్చాక గతంలో రైతుల కోసం అమలు చేసిన ఇన్‌పుట్ సబ్సీడీలన్నీ అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.