డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లావాసులకు శుభవార్త. డీజీపీ ఆదేశాల మేరకు ఈ నెల 14, 15న దిశ యాప్ డౌన్‌లోడ్ అండ్ రిజిస్ర్టేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ అంబికాప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, మహిళా పోలీసు, ఇతర ఉద్యోగుల సహకారంతో కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఆర్టీసీ కాంప్లెక్సు, కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు మరో బంపరాఫర్ ప్రకటించారు అమలాపురంలోని సీఎంఆర్ షాపింగ్‌మాల్, చెన్నై ఎంజీఆర్ మాల్, చందన బ్రదర్స్‌లలో ఎక్కడైనా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ర్టేషన్ చేయించుకుంటే వస్త్రాల కొనుగోళ్లపై 15శాతం రాయితీ ఇవ్వడానికి ఆయా సంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చినట్టు డీఎస్పీ చెప్పారు. మరీ ముఖ్యంగా యువతులు, మహిళలు దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
మరోవైపు చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు 150 ఫోన్లు అందజేశారు జిల్లా ఎస్పీ శ్రీ ధర్. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున, పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసే నిమిత్తం, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశామన్నారు. “CHAT BOT” సేవలు ప్రారంభించి, మూడవ దశ లో రూ. 30,00,000/- విలువ చేసే 150 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి ఈ రోజు బాధితులకు వారి ఫోన్‌లను అందజేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు 412 ఫోన్‌లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. తక్కువ వ్యవధిలోనే పోగొట్టుకున్న మొబైల్ తిరిగి వారి చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
“CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు పోలీసులు. ఫోన్ చోరీ చేసినా, పోయిన వారు వాట్సాప్ నంబర్ 8522913300 కు Hi లేదా HELP అని మెసేజీ పంపాలని.. ఈ విధానం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని దీనిని ప్రజలు సద్వినియోగం పరచుకొని పోగొట్టుకున్న మొబైల్స్ ను పొందవచ్చన్నారు. ఎవరికైనా దొరికిన మొబైల్స్‌ను సొంతానికి వాడుకోవడం, గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని మొబైల్స్ కొనుగోలు చేయొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా మొబైల్ దొరికితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలన్నారు.