ఎండలు మండుతున్న వేళ స్కూళ్లకు సెలవులు పొడగించాలని విన్నతులు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే ఏపీలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టారు. అయితే రాష్ట్రంలో ఎండలు ఏమాత్రం తగ్గలేదు.. వేడిగాలులు కూడా వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు ఇంకా ఊపందుకోలేదు. దీంతో మరో రెండు, మూడు రోజులు ఎండలు ఏ మాత్రం తగ్గవంటున్నారు. వడగాల్పులు కొనసాగుతాయంటున్నారు. ఈ క్రమంలో జూన్ 17 వరకు ఒంటిపూట బడులుంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే స్కూళ్లకు వారం రోజుల పాటూ సెలవులు ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు రాష్ట్ర పేరెంట్స్ సంఘం లేఖ రాసింది. స్కూళ్లకు మరో వారం పాటూ సెలవులు ప్రకటించాలని కోరారు. వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని.. పిల్లలు ఇబ్బందిపడతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వడగాలుల దృష్ట్యా పునరాలోచన చేసి సెలువులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మాత్రం ఒంటిపూట బడుల్ని ఈ నెల 17 వరకు కొనసాగిస్తోంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత ఎండలు, వడగాల్పులు ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజులు ఒంటిపూట బడుల్ని కొనసాగించే అవకాశం లేకపోలేదు. స్కూల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. తల్లిదండ్రులు ఆందోళనచెందాల్సిన అవసరం లేదంటున్నారు.