అడవిలో ఉండాల్సిన పులి రోడ్డెక్కితే జనం పరుగులు తీయాల్సిందే. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలంరేపింది. శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి పెద్దపులి సాక్షిగణపతి ఆలయం దగ్గర రోడ్డు దాటుతూ భక్తులకు కంటపడింది. పెద్దపులిని చూసిన స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కమాండర్ జీపులో శ్రీశైలం వెళ్తున్నవారికి రోడ్డు దాటుతూ పులి కనిపించింది.
పెద్దపులి సంచరిస్తుండగా కొందరు స్థానికులు, భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. పులిని చూసిన పలువురు యాత్రికులు భయభ్రాంతులకు గురవగా.. మరికొందరు మాత్రం రియల్‌గా పులిని చూసి థ్రిల్ అయ్యారు. మొబైల్ వీడియోను రికార్డు చేశారు. పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో.. స్థానికులతో పాటూ భక్తులను అప్రమత్తం చేశారు. రాత్రుల సమయాలలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. మంగళవారం రాత్రి 1 గంటకు సాక్షిగణపతి ఆలయం సమీపంలో రోడ్డు దాటుతూ అటవీశాఖ సిబ్బందికి పెద్ద పులి కనిపించిందని చెబుతున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న అటవీశాఖ సిబ్బందికి పెద్దపులి కనిపించడంతో జీపులో నుండి పెద్దపులిని సిబ్బంది వీడియో తీశారని చెబుతున్నారు. రాత్రి సమయంలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.