రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో ఆంధ్రలో కీలకంగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు.. కానీ 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పడప్పుడు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.. రాజకీయపరమైన అంశాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా.. లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది.
సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం మొదలైంది. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఎంఆర్ వర ప్రసాద్ అనే వ్యక్తి పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
లగడపాటి పోస్టర్ఆ పోస్టర్‌లో 'రాష్ట్ర ప్రజల సమస్యలను రాష్ట్రాభివ్రుద్ధిని కాంక్షించే ఆ గొంతు మళ్లీ గర్జించాలనే మా అందరి అభిలాష. సమర్థవంతమైన నాయకత్వం ప్రతిష్టవంతమైన ప్రణాలిక అది మీకే సాధ్యం నాయకుడా.. మీ స్ఫూర్తిని మరల మా అందరిలో నింపాలని, తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ.. లగడపాటి అభిమానులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక త్వరలో అని ప్రకటించారు. మళ్లీ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని మీ అభిమానులు, శ్రేయోభిలాషుల, కార్యకర్తలు, సామాన్య ప్రజల చిరకాల కోరిక అన్నారు. ఆ పోస్టర్ వైరల్ కావడంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీలో జరగబోయే వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు లగడపాటి రీ ఎంట్రీ వెనుక మరో ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కువశాతం టీడీపీ వైపు మొగ్గు చూపతారని చెబుతున్నారు. అదే జరిగితే ఆయన్ను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనేది చూడాలి. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే టీడీపీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటనేది చూడాలి. విజయవాడ ఎంపీ సీటు విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. మళ్లీ కేశినేని నాని బరిలోకి దిగుతారా.. కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది చూడా చూడాలి.
లగడపాటి రాజగోపాల్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2004, 2009లో విజయవాడ నుంచి ఎంపీగా విజయం సాధించారు. విభజన సమయంలో కూడా పెప్పర్ స్పేతో తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలు వదిలేస్తానన్నారు.. చేసిన సవాల్ మేరకు రాజకీయాలను వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికలు, పొలిటికల్ సర్వేలలో ఎక్స్‌పర్ట్‌గా మారారు. తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల ఎన్నికలపై తన విశ్లేషణలతో పాటూ సర్వే రిపోర్టును కూడా విడుదల చేసేవారు. ఆయన గతంలో చేసిన సర్వేలు కూడా చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు.
లగడపాటి ఓ రెండు, మూడేళ్లు బయటకు రాలేదు. కానీ ఉన్నట్టుండి 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 ఎన్నికల సమయంలో సర్వే రిపోర్టుల్ని తీసుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పారు.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ (TDP) అధికారంలోకి వస్తుందని చెప్పినా ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో తాను సర్వేలకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు..అప్పటి నుంచి ప్రైవేట్ ఫంక్షన్‌లలో మినహా.. పెద్దగా ఎక్కడా కనిపించలేదు లగడపాటి. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ అంటూ ప్రచారం జరుగుతోంది.. ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.