మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే రాష్ట్ర సంపద పెంచి అభివృద్ధి, సంక్షేమం అందించగల సమర్ధుడని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. స్థానిక మాధవీనగర్లోని తన స్వగృహంలో బుధవారం 41వ వార్డుకు చెందిన దాదాపు వంద మంది యువకులు గౌరు దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన యువత తెలుగుదేశం పార్టీ వైపు చూస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి భయం పట్టుకుందని, రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులుగా కష్టపడి పని చేయాలని అన్నారు. టీడీపీని నేరుగా ఎదుర్కోలేని వైసీపీ నాయకులు నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్మాదచర్యలకు పాల్పడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ఆచారి, శివ ఆచారి తదితరులు పాల్గొన్నారు.