ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకూ నెల రోజుల పాటు ‘జనగన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుసంధానంగా ‘సురక్ష’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ గ్రామ వలంటీర్, సచివాలయం సిబ్బంది, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి .. సమస్యలు ఆరా తీయాలని సూచించారు. గతంలో దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను ‘సురక్ష’లో భాగంగా వారికి స్వయంగా చెప్పాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఏ ఒక్కరికీ సచివాలయ పరిధిలో సమస్యలు లేకుండా కలెక్టర్లు చూడాలి. మండల స్థాయిలో ఎంపీడీవో, డిప్యూటీ కలెక్టర్లతో ‘సురక్ష’ కమిటీని నియమించాలి. కమిటీ ఎప్పుడు పర్యటిస్తుందో ముందే సమాచారం ఇవ్వాలి. ఒక ఊళ్లో ఒక రోజంతా గడపాలి. ప్రజలకవసరమైన పత్రాలను అప్పటికప్పుడే ఇచ్చేయాలి. వచ్చిన అభ్యర్ధనలన్నీ మ్యాపింగ్ చేయాలి’’ అని నిర్దేశించారు. ఖరీఫ్ మొదలవుతోందని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా నకిలీ అనేది ఉండకూడదని, అలా ఉంటే, దానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులు అవుతారని స్పష్టం చేశారు.