ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చే రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సరికొత్త కార్యక్రమం జగనన్న సురక్ష కు శ్రీకారం చుట్టనుందని విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, జోనల్ కమీషనర్లతో కలిసి జగనన్న సురక్ష కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సంతృప్తి స్ధాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా ఈ నెల 23వ తేదీ నుంచి జులై 23 వరకు జగన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించాలన్నారు. మండల స్దాయిలో ఎంపిడిఓ, తహశీల్దార్ ఒక బృందంగా ఏర్పడి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, జోనల్ కమీషనర్లు ఒక బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటించాలని, బృందం సందర్శించే గ్రామాన్ని ముందుగానే గ్రామస్తులకు తెలిపి సిద్ధంగా ఉంచాలన్నారు.