మునగపాక: టి.సిరసపల్లి రెవెన్యూ పరిధిలోని రామారాయుడుపేట సమీపంలో జీడిమామిడి తోటల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఎండతీవ్రతకు 40 ఎకరాల్లో జీడితోటలు దగ్ధమైనట్లు వెంకటాపురం మాజీ ఉప సర్పంచి గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. సాయంత్రానికి మంటలు అదుపు లోకి రాలేదు. టి. సిరసపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 138, 139లో 400 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ ఐదేళ్ల క్రితం రైతుల నుంచి సేకరించింది. ఎకరం రూ. పది లక్షల వంతున కొనుగోలు చేశారు. ఆయా భూముల్లో రైతులు జీడిమామిడి తోటలు సాగుచేసేవారు. అప్పటి నుంచి చెట్లు అలాగే ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రైతులే పలసాయం పొందుతున్నారు.
శుక్రవారం కొండపై మంటలు వ్యాపించాయి. ఎండతీవ్రతకు గాలి తోడవడంతో మంటలు విస్తరించాయి. అగ్నిమాపక వాహనాలు వచ్చినా ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ఎలాంటి రహదారిలేక నిలిచిపోయాయి. స్థానికులు వెళ్లి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయిందని సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 40 ఎకరాల్లో చెట్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఆ భూములకు చుట్టూ ఉన్న రామారాయుడుపాలెం, వెంకటాపురం, తానాం వైపు మంటలు వ్యాప్తిస్తున్నాయన్నారు. ఆయా గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.