రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాజధాని రైతులకు వార్షిక కౌలు సకాలంలో చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణం కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. వార్షిక కౌలు చెల్లింపు విషయంలో ప్రభుత్వం ప్రతీ ఏడాది జ్యాప్యం చేస్తుందన్నారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ప్రతీ ఏడాది మే 1న వార్షిక కౌలు చెల్లించాల్సి ఉందన్నారు. 2023 ఏడాదికిగాను పిటిషనర్‌కు రూ.9.03 లక్షలు కౌలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.