‘‘విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎంపీ కుమారుడు, భార్యను కిడ్నాప్ చేసిన నిందితులు... డబ్బులు తేవాలని ఎంపీని కాకుండా, ఆయన ఆడిటర్‌ను పిలుస్తారా?, ఈ చిన్న లాజిక్‌ను సీఎం జగన్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఎలా మిస్ అయ్యారో అంతుచిక్కడం లేదు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇది కడప, కర్నూల్ గ్యాంగ్‌ల పని అయి ఉండొచ్చన్నారు. ఇందులో నిందితుడిగా పేర్కొన్న హేమంత్‌కు సంబంధం లేదని, ఇదంతా పోలీసులు అల్లిన కట్టుకథ అని రఘురామ పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో సమగ్ర విచారణ జరిపించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని రఘురామ తెలిపారు. విశాఖలో రూ.వందల కోట్ల విలువైన భూములను ఫలహారం చేస్తున్నారని వీటన్నింటిపైనా విచారణ జరిపించాలన్నారు. విశాఖ భూ కుంభకోణంతో సీఎం జగన్‌కు సంబంధం లేదని, ఆయన స్వాతిముత్యం చిత్రంలో కమలహాసన్ కంటే అమాయకుడని తేలితే, వైసీపీకి మంచిదేనని రఘురామరాజు పేర్కొన్నారు. కాగా, మార్గదర్శి కేసు నిత్యం ప్రజల్లో నానడానికి జగన్, సీఐడీ చీఫ్ సంజయ్, ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణ ప్రయత్నిస్తూ, శునకానందాన్ని పొందుతున్నారని ఆయన విమర్శించారు. మార్గదర్శి సంస్థపై సీఐడీ నమోదు చేసిన కేసుకు డిపాజిటర్ల చట్టం 5 వర్తించదని వివరించారు. టీటీడీ ఇన్‌చార్జ్ ఈవో ధర్మారెడ్డిని న్యాయవ్యవస్థలోని వ్యక్తులంతా దేవుడి ఏజెంట్‌గా భావిస్తూ ఆయన ఇచ్చే ప్రసాదాలను తీసుకుంటున్నారని చెప్పారు. కానీ ధర్మారెడ్డి దానవుడికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.