ముఖ్యమంత్రి కాదుకదా పవన్ ను ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తేల్చిచెప్పారు. గంటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్న పవన్ కల్యాణ్ ను ఎవరైనా మంచి సైక్రియాటిస్టుకు చూపించాలని జనసేన నేతలకు ఆయన సలహా ఇచ్చారు. ఈమేరకు మంత్రి దాడిశెట్టి రాజా శనివారం మీడియాతో మాట్లాడుతూ జనసేనానిపై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సభలకు జనం రావడంలేదని, వచ్చినా నామమాత్రపు జనాలను ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి సెటైర్ వేశారు. ఎవరికి వారు నిర్ణయించుకుంటే పదవులు రావని, ప్రజలు నిర్ణయించుకుంటే మాత్రమే వస్తాయని హితవు పలికారు. ఏపీలో సుమారు కోటి మంది పిల్లలు ఐశ్వర్యారాయ్ నో లేక అనుష్కనో లేక తమన్నానో పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటారని మంత్రి చెప్పారు. వారు అనుకుంటే పెళ్లి అయిపోతుందా.. ఆ హీరోయిన్లు ఒప్పుకున్నప్పుడే కదా పెళ్లి జరిగేది అని అన్నారు. అదేవిధంగా ప్రజలు డిసైడ్ అయితేనే సీఎం అవుతారు తప్ప ఎవరికి వారు డిసైడ్ అయితే కారనేది తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ కు చురకలు వేశారు.
‘మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటేయండి’ అంటూ సీఎం జగన్ ప్రజలకు చెబుతున్నారని మంత్రి దాడిశెట్టి చెప్పారు. ఓటర్లకు అలా చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ లకు ఉందా? అని నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన రెండు సభలూ జనం రాక ప్లాప్ అయ్యాయని, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయంపై పవన్ కల్యాణ్ కే క్లారిటీ లేదని మంత్రి దాడిశెట్టి ఎద్దేవా చేశారు.