దేశ రాజధాని ఢిల్లీలో గత కొంతకాలంగా గన్ కల్చర్ పెరిగిపోతుంది. దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ గాయాలపాలైన ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మహిళలు ఇద్దరూ చనిపోయారని పోలీసులు తెలిపారు.
కాల్పుల ఘటనకు సంబంధించి నైరుతి ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4:40 సమయంలో ఆర్కే పురం స్టేషన్ కు ఫోన్ వచ్చింది. అంబేద్కర్ బస్తీలో కాల్పుల శబ్దం వినిపించిందని చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో గాయాలతో పడి ఉన్న పింకీ, జ్యోతి అనే మహిళలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు. ఈ హత్యల వెనక డబ్బు సెటిల్మెంట్ వ్యవహారం ఉండి ఉండొచ్చని భావిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని వివరించారు.