సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారిని విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో ఆలయ బేడా ప్రదక్షిణ చేశారు. ఆపై గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ... సింహాచలం సింహాద్రి అప్పన్న విశాఖ శారదాపీఠానికి తమకు ఇలవేల్పు దైవమన్నారు. రేపటి (బుధవారం) నుంచి అక్టోబర్ 5 వరకు ఋషికేశ్‌లో చాతుర్మాస దీక్ష చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అలా దీక్షకు వెళ్లేముందు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఋషికేశ్‌లో గంగానది తీరాన స్నానమాచరించి 115 రోజులు పాటు మౌనంగా దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న సాధుపుంగవులకు,మహాత్ములు, యోధులు, జ్ఞానులు భక్తులకు దుప్పట్లు, భోజన సదుపాయాలు అందిస్తూ ఉంటామన్నారు. జగత్గురు ఆది శంకరాచార్యులు తెలియజేసిన భాష్యాన్ని వారికి తెలియజేస్తూ ముందుకు వెళతామని చెప్పారు. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రధాన దేవత రాజశ్యామల యాగం చేస్తూ ప్రత్యేక పూజలు చేయనున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు.