టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుష్ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది. అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శ్రీవాణిట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయంటూ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. శ్రీవాణితో వైసీపీ నేతలు దోపిడి చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ఉందని, అందులోనే విరాళాలు జమవుతాయన్నారు. టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదన్నారు. శ్రీవాణితో పాటు ఇతర ఏ ట్రస్టుల్లోనైనా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. శ్రీవాణి టికెట్ తీసుకునే భక్తులకు ట్రస్టు విరాళం కింద రూ.10 వేలు, దర్శన టికెట్ కోసం రూ.500లకు రెండు రసీదులు ఇస్తామని వివరిస్తూ కొన్ని రసీదులను మీడియాకు చూపారు. రూ.500కు మాత్రమే రసీదు ఇచ్చి మిగిలిన రూ.10 వేలు దోచుకుంటున్నారని రాజకీయ, వ్యక్తిగ త లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.