ఎవరైనా రెస్టారెంట్‌కు వెళ్లినపుడు ఇష్టమైన ఆహారాన్ని లాగించేస్తారు. బిల్లు ఎక్కువైనా సరే కావాల్సిన ఐటెమ్స్ అన్ని ఆర్డర్ చేసుకుని తింటారు. అయితే ఓ కుటుంబం కూడా అలాగే రెస్టారెంట్‌కు వెళ్లి.. తిన్నారు. అంతా అయిపోయాక వెయిటర్ బిల్లు తీసుకువచ్చి ఇచ్చాడు. ఆ బిల్లు చూసి వారు అవాక్కయ్యారు. అయితే వారు అవాక్కయింది తిన్న ఐటెమ్స్‌కు సంబంధించిన బిల్ కాకుండా.. అందులో ఉన్న సర్వీస్ ఛార్జ్ చూసి. రూ. 970 సర్వీస్ ఛార్జ్ విధించడంతో వారు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో సెక్టార్ 75 లో ఉన్న స్పెక్ట్రమ్ మాల్‌లో ఉన్న డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్‌కు ఓ కుటుంబం వెళ్లింది. ఆదివారం సాయంత్రం 12, 13 మంది కుటుంబ సభ్యులు డిన్నర్ చేయడానికి వెళ్లారు. వారికి ఇష్టం ఉన్న ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకుని తిన్నారు. అంతా అయిపోయిన తర్వాత వారు బిల్ ఇవ్వాలని కోరారు. దీంతో వెయిటర్ బిల్ తీసుకువచ్చి టేబుల్‌పై ఉంచాడు. అది చూసి వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బిల్లులో రూ. 970 సర్వీస్ ఛార్జ్ విధించారు.
రూ. 970 సర్వీస్ ఛార్జ్ చూసి వారు ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అధికంగా సర్వీస్ ఛార్జ్ విధించారని.. వెంటనే దాన్ని బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి రెస్టారెంట్ యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఘర్షణకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, ఆ కుటుంబ సభ్యులు తిట్టుకోవడం ప్రారంభించారు. పరిస్థితి అదుపు తప్పడంతో వారు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ తతంగాన్ని మొత్తం ఆ హోటల్‌కు వచ్చిన మిగితా కస్టమర్లు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో ఉంచడంతో అవి వైరల్‌గా మారాయి.
రెస్టారెంట్‌లో సిబ్బంది, కస్టమర్లు కొట్టుకున్న విషయం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో హోటల్ సిబ్బంది, ఆ కుటుంబం ఇద్దరూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితో స్పెక్ట్రమ్ మాల్‌లో ఉన్న ఆ రెస్టారెంట్‌ను మూడు నెలల కిందటే ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.