చార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గర్భ గుడిలో ఉన్న శివలింగంపై ఓ మహిళ.. డబ్బులు వెదజల్లడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ సమయంలో ఆలయ పూజారులు సైతం అక్కడే ఉండి వేద మంత్రాలు పఠించారు. వారు కూడా మహిళను అడ్డుకోకపోవడం తీవ్ర వివాదంగా మారింది.
కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. ఆలయ పురోహితులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. ఆ సమయంలో గర్భగుడిలోకి వెళ్లిన ఓ మహిళ.. శివలింగానికి పక్కనే నిలబడి ఉంది. అనంతరం అక్కడ ఉన్న కేదారీశ్వరుడిపై కరెన్సీ నోట్లను చల్లింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వారు ఫొటోలు, వీడియోలు తీశారు. ఇవి కాస్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం. అలాంటిది ఆమె లోపలికి వెళ్లి నోట్లను శివలింగంపై చల్లుతూ అనుచితంగా ప్రవర్తిస్తుంటే మహిళను ఎవరూ అడ్డుకోకపోవడంతో సోషల్ మీడియాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవిత్రమైన కేదార్‌నాథ్ గర్భగుడిలో ఇదేం ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు.. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, నిర్వహణ అధికారుల తీరుపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ - కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ స్పందించారు. రుద్ర ప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపైనా కఠినంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా.. కేదార్‌నాథ్ ఆలయ గోడల స్వర్ణ తాపడం విషయంలో భారీ అవినీతి జరిగిందంటూ ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ భారీ అవినీతి కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శివలింగంపై మహిళ నోట్లు చల్లిన ఘటన బయటికి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేదార్‌నాథ్ ఆలయ అధికారుల పని తీరు, దేవాలయ నిర్వహణ తదితర అంశాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.