ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఘనంగా ప్రారంభం కానున్న బయో ఎనర్జీ ప్లాంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:48 AM

నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న బయో ఎనర్జీ ప్లాంట్లకు సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తున్నందున ఏర్పాట్లపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా నిరంతరం విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ కనెక్షన్ల ఏర్పాటు, సౌండ్‌ సిస్టం, శిలాఫలకం ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్రిబ్కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ వారు సర్వేపల్లిలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌, విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ వారు మరో బయో ఎనర్జీ ప్లాంట్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారన్నారు. ఈ ప్లాంట్లు ధాన్యం ఆధారంగా పని చేస్తాయని, నూకలు, తడిసిన ధాన్యం, జొన్నలను ముడి పదార్థాలుగా వినియోగిస్తాయని వాటి నుంచి బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ పరిశ్రమల వల్ల కాలుష్యం ఉండదని క్రిబ్కో మార్కెటింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర రావు, విశ్వసముద్ర ప్రైవేటు లిమిటెడ్‌ ప్రతినిధి హేమేంద్ర నాయుడులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, విద్యుత్‌ శాఖ ఈఈ సోమశేఖర్‌రెడ్డి, తహసీల్దారు కృష్ణ, కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa