ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని పలు జిల్లాల్లో ఊపందుకున్న వర్షాలు,,,రాబోయే రెండు మూడు రోజులు వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:24 PM

ఎట్టకేలకు ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇన్ని రోజులు ఎండలు, వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరైన జనాలకు వర్షాలతో ఉపశమనం లభించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి వర్షాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు భగ భగ మండే ఎండల నుంచి ప్రజలు రిలీఫ్ పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి విజయవాడతో పాటూ గుంటూరు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రెండు గంటలుగా భారీగా వాన పడింది.


నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. బుధవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి , కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విజయనగరం,విశాఖ, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య, YSR,సత్యసాయి,అనంతపురం,కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.


మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 66.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా కొండేపిలో 64 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో 58.5 మి.మ.. గుంటూరు జిల్లా కొల్లిపర 49.5, మంగళగిరిలో 64 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


తిరుమలలో భారీ వర్షం.. శేషాచలం కొండలపై కొత్త అందాలు


గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయంటున్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.


అంతేకాదు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండ, వడగాలుల తీవ్రత కొనసాగుతుండగా.. మరి కొన్ని చోట్ల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయంటున్నారు. ఈ వానలతో రైతులు పొలం పనులకు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వానలు పడుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa