కాలినడకన తిరుమలకు చేరుకునే అలిపిరి మార్గంలో గురువారం రాత్రి నాలుగేళ్ల బాలుడిపై ఓ చిరుతపులి దాడి చేసింది. నోటకరచుకుని దాదాపు 200 మీటర్ల మేర అడవిలోకి ఈడ్చుకెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు, దుకాణదారులు, దగ్గర్లోని భద్రతా సిబ్బంది అరుపులు, కేకలకు భయపడి బాలుడిని విడిచిపెట్టి అడవిలోకి వెళ్లిపోయింది. చిన్నపాటి గాయాలతో ఆ బాలుడు బయటపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్తబృందం శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి అలిపిరి నుంచి తిరుమలకు బయల్దేరింది. ఏడవమైలు సమీపంలో భోజనం చేసే సమయంలో ఆ బృందంలోని నాలుగేళ్ల బాలుడు కౌశిక్ అడుకుంటూ పక్కకు వెళ్లాడు. అడవి నుంచి ఒక్కసారిగా నడక మార్గంలోకి దూసుకువచ్చిన చిరుత పులి కౌశిక్‌పై దాడి చేసి అతడి తలను పట్టుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. బాలుడి అరుపులతో కుటుంబ సభ్యులు, స్థానిక వ్యాపారులు, దగ్గర్లోని భద్రతా సిబ్బంది పులి వెనుకే అడవిలోకి పరుగులు తీశారు. బిగ్గరగా అరుస్తూ టార్చ్‌లైట్లు వేయడం, రాళ్లు విసరడంతో చిరుత భయపడి బాలుడిని అటవీ ప్రాంతంలోని పోలీస్ ఔట్‌పోస్ట్ వెనుకభాగంలో విడిచిపెట్టి పారిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది రక్తగాయాలతో పడి ఉన్న కౌశిక్‌ను తీసుకుని పరుగులు పెడుతూ రోడ్డుపైకి వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ప్రథమచికిత్స అందించారు. చిరుత నోటకరుచుకోవడంతో కౌశిక్ చెవి ముందు, వెనుకభాగాల్లో, మెడపై గాయాలయ్యాయి. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘటనా ప్రాంతానికి చేరుకుని బాలుడిని పరిశీలించి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. సకాలంలో భక్తులు, దుకాణదారులు, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది స్పందించడం వల్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడని, భయంతో ఏమాత్రం వెనకడుగు వేసినా దక్కేవాడు కాదని అధికారులు అభిప్రాయపడ్డారు.