‘‘నోరు తెరిచి అడగలేక అర్హత ఉండి కూడా పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా ప్రభుత్వ పథకాలు, సేవలకు నోచుకోకుండా ఉంటే ఆ అర్హుల తలుపుతట్టి మరీ మంచిచేసే కార్యక్రమమే జగనన్న సురక్ష’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, జగనన్న ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులందరూ నేరుగా రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాల తలుపులు తట్టి వారికి ప్రభుత్వం నుంచి అందే ప్రతి పథకం, సేవలు లబ్ధిదారుల చెంతకు తీసుకెళ్లడమే జగనన్న సురక్ష కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, సేవలు 99 శాతం మందికి అందుతున్నాయని, మిగిలిన 1 శాతం మంచి పేదలు కూడా అలా మిగిలిపోకూడదని, వారికీ మంచి చేయాలనే తపన, తాపత్రయంతో జూలై 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.