వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఏపీలో రాజకీయ ప్రచారాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. తాను అనుకున్న విషయాన్ని ఎవరు వ్యతిరేకించినా.. అధికారంలోకి వస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం ఒలిచేస్తా వంటి హింసాత్మకమైన బెదిరింపులాంటి వ్యాఖ్యలు.. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో.. హిట్లర్, సద్దాం, ఉన్‌తో సహా ఎవరూ అనరన్నారు.
తాను అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అది చేయొచ్చు అని చెప్పడమా అన్నారు వర్మ. ఏది ఏమైనా ఒక ప్రజా స్వామ్య దేశంలో తన అనుచరులు, అభిమానులకు నేరుగా ఇంత దారుణమైన, హింసను ప్రేరేపించేలా మాట్లాడి రెచ్చగొట్టడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అన్నారు ఆర్జీవీ.
ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే.. ఆ సమావేశాలకు వచ్చే ఆ యువకులు భవిష్యత్‌లో ఏమవ్వాలనుకుంటున్నారో ఆ పవన్ కళ్యాణ్‌కే తెలియాలి అంటూ.. జనసేనానిని ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైగా ఈ హింసను ప్రోత్సహించేలా బెదిరింపుల లైవ్ వీడియాను పిల్లలతో కలిసి పెద్దలు టీవీ ముందు కూర్చుని చూస్తారన్న సంగతి మర్చిపోకూడదు అంటూ ట్వీట్ చేశారు.