ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాము ప్రేమించిన వారిని తమ వైపు ఆకర్షించుకునేందుకు.. వివిధ రకాల తంటాలు పడుతూనే ఉంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం.. ప్రియురాలిని తన వైపు తిప్పుకునేందుకు దొంగతనాలకు తెర తీశాడు. ఆమెకు బహుమతులు ఇచ్చేందుకు ఖరీదైన ఇళ్లు, బంగారం దుకాణాల్లో చోరీలు చేసేవాడు. దీంతో ఏకంగా అతని ప్రియురాలికి రూ. 60 లక్షల విలువైన బహుమతులు, డబ్బులు అందించాడు. చివరికి పోలీసులకు చిక్కడంతో అసలు విషయం బయటపడింది.
ప్రియురాలిని ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చేందుకు ఒక వ్యక్తి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి దోపిడీలకు (UP man robberies) పాల్పడ్డాడు. ఇటీవల రూ.60 లక్షలను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆ జంటతోపాటు గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల పరాస్ తివారీ.. 24 ఏళ్ల మహిమా సింగ్ అనే యువతిని ప్రేమించాడు. ఆమెను ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చేందుకు దొంగతనాలకు దిగాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ ముఠాను కూడా ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారు. పట్టణ శివారు ప్రాంతాలే లక్ష్యంగా చేతి వాటం ప్రదర్శించేవారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లు, నగల షాపులే లక్ష్యంగా చాకచక్యంగా దోచుకునేవారు. ఇలా దొంగిలించిన సొమ్ము, నగలను పరాస్ తివారీ.. తన ప్రేయసి మహిమా సింగ్‌కు ఇచ్చేవాడు. మరికొన్ని వెండి, బంగారు ఆభరణాలను జ్యువెలరీ దుకాణాల్లో విక్రయించేవారు.
పరాస్ తివారీ ముఠా ఇటీవల ఓ భారీ దోపిడీకి పాల్పడింది. దీంతో చోరీ చేసిన సొమ్ము నుంచి ఏకంగా రూ. 60 లక్షలను ప్రేయసి మహిమా సింగ్‌కు గిఫ్ట్‌గా అందించాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసలు గుట్టు రట్టయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం, దోపిడీ కేసులన్నింటినీ బయటికి తీశారు. కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ఆలయ సమీపంలో ఉన్న పరాస్ తివారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా సొమ్ము, నగలు స్వాధీనం చేసుకున్నారు. రూ.9 లక్షల డబ్బులు, రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఆయుధాలు, మూడు బుల్లెట్లను పట్టుకున్నారు.
ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారణ జరపడంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో పరాస్ తివారీ, అతని ప్రియురాలు మహిమా సింగ్‌తో పాటు.. మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి.. కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.