ఆయన చేసేది విహార యాత్ర అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదు.. విహారయాత్ర అన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారని.. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలన్నారు.. ఆయనకు దమ్ముంటే జిల్లాలో అభివృద్ధి పై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమయం, వేదిక లోకేష్ ఇష్టమన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరి హయాంలో జరిగాయో లోకేష్‌కు తెలుసా అన్నారు. జిల్లాలో పెన్నాపై, సంగం, నెల్లూరు బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారో తెలుసా.. నెల్లూరు సిటీలో చర్చిద్దాం.. దమ్ముంటే రావాలని లోకేష్‌కి అనిల్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రమంతా పాదయాత్ర తర్వాత చేయొచ్చని.. ముందు మంగళగిరి నియోజకవర్గంలో గెలవాలని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిపై ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
ఆనం కుటుంబం పట్ల ఇంకా మంచిపేరు ఉందంటే.. అది విజయ్ కుమార్ రెడ్డి వల్లే అన్నారు అనిల్ కుమార్. రాంనారాయణరెడ్డికి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే జగన్‌ని విమర్శించారని.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి ఆనం రాజీనామా చేయాలని మండిపడ్డారు. 2019లో జగన్ అవకాశం ఇవ్వకుంటే ఆనంకు పునర్జీవం ఉండేది కాదన్నారు. గతంలో జరిగిన విషయాలను ఆనం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. నెల్లూరు సిటీ, రూరల్‌లో ఆనంకు బలం లేదన్నారు.