వైసీపీ నేతల అవినీతి గురించి లెక్కకు మిక్కిలిగా ఉన్న ఫైళ్లు చదివి సైట్ కూడా వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చమత్కరించారు. అప్పుడప్పుడు తాను కళ్లజోడు పెట్టుకుని చదువుతుండడానికి కారణం అదేనని తెలిపారు. వైసీపీ వాళ్ల వల్ల తన కళ్లకు ఛత్వారం పెరిగిపోయిందని నవ్వుతూ చెప్పారు. రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల జనసేన నేతలు బాధ్యతగా వ్యవహరించాలని, స్థానిక వైసీపీ నేతలకు జనసేన నేతలు భయపడ్డా, వారికి సరైన సమాధానం ఇవ్వలేకపోయినా తాను వచ్చి సమాధానం ఇస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని ప్రవహిస్తూ అంతర్వేదిలో కలుస్తుందని, ఈ పవన్ కల్యాణ్ కూడా ఈ నేలను అలాగే అంటిపెట్టుకుని ఉంటానని పునరుద్ఘాటించారు.
తెలంగాణ, ఆంధ్రా విడిపోయినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పచ్చదనాన్ని, కోనసీమ పచ్చదనాన్ని తెగ తిట్టిపోశారని పవన్ వెల్లడించారు. మీకు పచ్చదనం ఉంది, మా ప్రాంతాల్లో పచ్చదనం లేదని అన్నారని తెలిపారు. ఇకపై తాను ఇక్కడే ఉంటానని, ప్రతి మండల సమస్యలు తెలుసుకుంటానని, పరిష్కార మార్గాలు రూపొందిస్తానని స్పష్టం చేశారు. జనసేనకు అండగా నిలిచిన రాజోలు నుంచే మార్పును మొదలుపెడదాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.