మంగళగిరి నగరంలో ఆవుల పెంపకం దారుల నిర్లక్ష్యం మూగ జీవాలకు శాపంగా మారుతుంది. నగరంలో వందలాది ఆవులను పెంపకందారులు రోడ్లపైకి విడిచిపెడుతున్నారు. దీంతో ఆవుల నగరంలోని ప్రధాన వీధుల యందు సంచరిస్తూ తమ పొట్ట నింపుకుంటున్నాయి. అయితే విచ్ఛల విడిగా రోడ్లపై ఆవులు తిరగడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ఆవులు, దూడ పిల్లలు ప్రమాదాలకు గురై నరకయాతన అనుభవిస్తున్నాయి. ఆవులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పేడను వేయడంతో వాటిని వాహనాలు జారి వాహనదారులు ప్రమాదానికి గురౌతున్నారు. అలానే రోడ్లపై ఆవులు నిద్రిస్తున్న సమయంలో అవి వాహనదారులకు కనిపించకపోవడంతో వాహనదారులు ఆవులను ఢీకొట్టి ప్రమాదాల భారిన పడుతున్నారు.
ఇదిలా ఉంటే. తాజాగా గౌతమ బుద్దా రోడ్డులోని అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం రాత్రి నిద్రిస్తున్న ఆవు దూడపిల్లపై జేసీబీ వెనుక చక్రం ఎక్కింది, తాజాగా సొమవారం రాత్రి అదే ప్రాంతంలో నిద్రిస్తున్న ఆవు దూదల పైకి కారు చక్రం ఎక్కడంతో రెండు దూడ పిల్లలు ఆర్తనాదాలు చేశాయి. స్థానికులు అక్కడికి చేరుకుని సపరియలు చేశారు.
రోడ్లపై విచ్ఛలవిడిగా తిరిగే ఆవులను వాటి పెంపకందారులు రోడ్లపైకి వదలకుండా ఇంటివద్దనే పెంచుకోవాలని మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు గతంలో పలుమార్లు ఆవుల యజమానులకు అవగాహన కల్పించడంతో పాటు నోటీసులు జారీచేశారు. అటు మూగజీవాలు. ఇటు వాహనదారులు గాయాలపాలవుతున్నా. ఆవుల యజమానులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు విశ్మయానికి గురిచేస్తుంది. గతంలో అధికారులు చెప్పినట్లు ఆవులను శ్రీశైలం అడవుల్లో ఒక సారి విడిచి పెడితే మరళా రోడ్లపైకి ఆవులను వదలకుండా చూసుకుంటారేమోనని స్థానికులు అంటున్నారు.