జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ రాంప్రసాద్ మృతి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా, మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ సెల్ఫీ వీడియోలో శ్యామ్ పేర్కొన్నాడు. శ్యామ్ మృతి ఘటన రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే శ్యామ్‌ను హత్య చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సెల్ఫీ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్యామ్ ఈ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమ్మా, నాన్న.. ఐ యామ్ సారీ. నేను ఉన్నా.. మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇన్ని రోజులు నన్ను పెంచినందుకు మీకు థ్యాంక్స్. మళ్లీ జన్మంటూ ఉంటే మీకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. మిస్ యూ మమ్మీ. మిస్ యూ డాడీ. అన్నా.. సాయి శీనన్న.. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ బ్రదర్ నువ్వే అన్నా. లవ్ యూ ఫర్ ఎవర్ సాయన్నా.’ అని వీడియోలో ఉంది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ మణికంఠ రాంప్రసాద్ (20 ఏళ్లు) జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో వేదికపై దూసుకొచ్చిన శ్యామ్.. జూనియర్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెనక్కి లాగేస్తుండగా, ఎన్టీఆర్ వారించి.. హగ్ ఇచ్చి పంపించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. అలాంటి శ్యామ్ మృతి చెందాడనే వార్త ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
చింతలూరు గ్రామంలోని శ్యామ్ అమ్మమ్మ ఇంట్లో శనివారం (జూన్ 25) ఉదయం అతడు విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని మొదట వార్తలు రాగా, అది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు.
‘శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎన్టీఆర్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.