ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర చత్తీస్ గఢ్‌లో కొనసాగుతోంది.. అలాగే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర మధ్య ప్రదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రమంతా విస్తరించాయి.
అల్పపీడనం, ఆవర్తనంతో పాటూ రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. నేడు (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరో మూడు రోజుల పాటూ ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే అక్కడక్కడా బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాతవరణం మారిపోయింది. అంతేకాదు ఆకాశం మేఘావృతమై ఉంది.. కొన్ని చోట్ల చిరు జల్లులు పలకరించాయి. వర్షాలు కూడా ఊపందుకోవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.. అలాగే జనాలు కూడా ఎండలు, వేడి గాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా, దక్షిణ .ార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. అలాగే రుతుపవనాలు విస్తరించడంతో.. మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు, జల్లులు కురుస్తాయని తెలిపారు. సోమవారం వరకు రాష్ట్రంలో అత్యధికంగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో 7సెం.మీ, జగిత్యాల జిల్లా మల్లాపూర్ 6, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 5, కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.