20 కోట్ల నిధులను వెచ్చించి శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఆసుపత్రి ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిని డి సి హెచ్ ఎస్ గౌరీ శంకర్ స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అలాగే ఆసుపత్రి సూపర్డెంట్ నీలతో కలసి మంగళవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ గౌరీ శంకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న మౌళిక సౌకర్యాలతో పాటుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆసుపత్రిలో ప్రస్తుతం 70 ఐపి ఉందని, ఆరోగ్యశ్రీ వార్డులో 48 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీకి చెందిన సీనియర్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో చర్చించి, సత్వర చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తమకు ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గది కేటాయించాలని 108 వాహన సిబ్బంది ఎమ్మెల్యే శ్రీనివాసరావును కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.