నందమూరి తారక రామారావు విగ్రహ ప్రారంభోత్సవం తుమ్మలపల్లిలో గ్రామస్థుల సహాయ సహకారాలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు యెర్నేని సీతాదేవి, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ పార్టీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని, వైసీపీ పాలనకు బుద్ధి చె ప్పాలన్నారు. యెర్నేని సీతాదేవి మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించక ముందు రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉందో ఈ నాలుగేళ్ల పరిపాలన కూడా అలాగే ఉందన్నారు. యర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. త్వరలో జనార్థనపురం నుంచి లక్ష్మీనరసింహపురం రోడ్డుపై ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపడతామన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే భూములు, కాలువలు కూడా మిగలవన్నారు. రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అంతా ఏకమై అన్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన నాయకులకు సత్కారం చేశారు.