ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, తమ పిల్లలను చదివించేందుకు తల్లులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రూపొందించి, అమలు చేసిన అమ్మ ఒడి 4వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి 13 వేల రూపాయలు జమ కానున్నాయి.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్వతీపురం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభలో బటన్ నొక్కి అమ్మ ఒడి డబ్బులను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లులకు అలాగే విద్యార్థులకు సంబంధిత గ్రామ వాలంటీర్లు కేవైసీని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే సాంకేతిక కారణాలు దృష్ట్యా విద్యార్థుల తల్లులకు సంబంధించిన కేవైసీ పూర్తి కాకపోతే, జూన్ 28వ తేదీ తరువాత కేవైసీని పూర్తి చేసుకున్న తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి డబ్బులు జులై మొదటి వారంలో జమ కానున్నట్లు సమాచారం.